ఖవాజకు చోటు కష్టమే: పాంటింగ్​

మెల్‌బోర్న్‌: నిలకడలేమీ కారణంగానే.. సీనియర్‌ బ్యాట్స్​మన్​ ఉస్మాన్‌ ఖవాజను టీమ్‌ నుంచి తొలిగించారని ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను టీమ్‌లోకి తిరిగి రావడం కష్టమేనన్నాడు. గతేడాది యాషెస్‌ సిరీస్ మధ్య ఉద్వాసనకు గురైన ఖవాజకు.. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా ఇవ్వలేదు. ‘ఖవాజ మంచి బ్యాట్స్​మన్​  అని నేను భావించేవాడిని. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. చాలా అవకాశాలు ఇచ్చాం. అయినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో నిలకడలేదు. నిజాయితీగా చెప్పాంటే అతను ఆసీస్‌కు ఆడటం కష్టమే. టీమ్‌లో ప్లేస్‌ల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. వాటిని తట్టుకుని చోటు సంపాదించడం ఖవాజకు చాలా కష్టం’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్​లో భారీగా పరుగులు చేసి.. అప్పుడు అంతర్జాతీయ కమ్‌ బ్యాక్‌ గురించి ఆలోచించాలన్నాడు. ‘గొప్ప ప్లేయర్లు ఎప్పుడూ వదిలిపెట్టరు. సమ్మర్‌లో దేశవాళీ సీజన్​ మొదలవుతుంది. అందులో సత్తా చాటితే తప్పకుండా అవకాశం రావొచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. క్వీన్స్​లాండ్​ తరఫున పరుగుల వరద పారించి మరో అవకాశం కోసం వేచి చూడాలి. ఇలా చేయడంతో టీమ్‌లో ఎవరైనా ఫామ్‌  కోల్పోతే కచ్చితంగా ఆడే అవకాశం వస్తుంది’ అని పాంటింగ్‌ స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *